Wednesday, November 19, 2014

7 days in slow motion


7daysinslowmotionకోడి కూయక ముందే లేచి, ప్రైవేట్లు, ట్యూషన్లకు పోయి, రాత్రి పదికో, పదకొండుకో ఇల్లు చేరే పిల్లలు. వాళ్ళతో పాటు వాళ్ళ చదువులు, తాము కూడా చదివినంతగా కష్టపడే తల్లిదండ్రులు. ఒకోసారి పిల్లలు పుస్తకాల మీద నుంచి దృష్టి కూడా కదపని పరిస్థితుల్లో వాళ్ళకు అన్నం కలిపి, ముద్దలు చేసి నోట్లో పెట్టి తినిపించి, వాళ్ళ పుస్తకాలు సర్ది ఇచ్చి, వాళ్ళ బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి ఇచ్చి, చదువు మాత్రమే వాళ్ళ ఏకైక బాధ్యతగా పెంచే తల్లిదండ్రులు ఈ రోజుల్లో కోకొల్లలు. ప్రతి దశలోనూ పిల్లల పరీక్షా ఫలితాలు వచ్చే సమయానికి యావత్కుటుంబం ఊపిరి బిగపట్టి, రక్తపోటు పెంచుకుని, కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూపులు. ఆశించిన ఫలితాలు అందకపోతే అక్కడక్కడా అఘాయిత్యాలు జరగడం కూడా కద్దు. నేటి మధ్య తరగతి ప్రజలకు ఇది నిత్య జీవిత వాస్తవం.
అలాంటి ఓ తల్లిదండ్రుల కొడుకు రవి. “ఆటలు,సరదాలు అనవసరం. చదువులోనే రోజుకు 60 శాతం గడపాలి. సరదా చేయడానికి వీసమంత సమయం చాలు. ఎప్పుడూ క్లాసులో మొదటి రాంకునే సంపాదించాలి. తనకన్నా తెలివైనవాళ్ళ సావాసమే చెయ్యాలి” అనేది తల్లి ఆదేశం, ఉపదేశం. సినిమాలంటే ఆమె మండి పడుతుంది. సినిమాల గురించి మాట్లాడే స్నేహితులతో సావాసం చేస్తున్నాడని కొడుకుని తప్పు పడుతుంది.
రవి తెలివైన వాడే. క్లాసు పిల్లల్లో పై రాంకుల్లో వుండేవాడే. కానీ, రవికి సినిమాల పిచ్చి. సినిమా తియ్యాలనే ఉబలాటం. ఆ తల్లి తనమీద పెట్టుకున్న ఆశలు వమ్ము చేస్తానేమోననే విపరీతమైన భయం మరో వేపు. తనమూలాన తల్లి ప్రాణత్యాగం చేస్తున్నట్లు పీడకలలు.
రవి తండ్రి సూరి. అతనికి క్రికెట్ పిచ్చి. టీవీలో చూసే అవకాశం ఎలానూ లేదు. కనీసం రేడియోలో కామెంటరీ ఐనా వినాలనే తాపత్రయం. వింటూ వింటూ పెళ్ళానికి దొరికి పోతానేమోననే జంకు. అందుకోసం రకరకాల ఎత్తులు వేస్తూ, కొడుకుతో లాలూచీ పడుతూ నాటకాలాడుతుంటాడు.
రవి అమ్మమ్మకు విదేశాల్లో ఉంటున్న తన చిన్న కూతురిపై పక్షపాతం. ఆ కూతురి గొప్పలు గోరంతలు కొండంతలు చేసి చెప్తూ తనను పోషిస్తున్న పెద్ద కూతురు (రవి తల్లి)ని తక్కువ చేసి మాట్లాడుతుంటుంది. తల్లి ప్రవృత్తిని తట్టుకోలేని కూతురు కోపం కక్కలేక, మింగలేక హింస పడుతుంటుంది. ఐతే రవి చదువే తన జీవిత పరమావధిగా పెట్టుకుని, వాడు ఏదైనా ఓ ఐవీ లీగ్ స్కూల్లో సీటు సంపాదిస్తే అదే తన జీవితానికి సాఫల్యంగా తలుస్తూ, కొడుకెక్కడ తప్పటడుగు వేసేస్తాడో, ఏ స్నేహితుడు తప్పుదారి పట్టించేస్తాడోనని భయపడ్తూ, తన జీవితాన్నీ, తనవాళ్ళ జీవితాన్నీ కూడా ఎక్కడలేని ఆవేదనకూ గురి చేస్తుంటుంది.
ఈ నేపథ్యంలో కాకతాళీయంగా నగరంలో జరుగుతున్న సినిమా ఉత్సవానికి సమీక్షకుడిగా విదేశం నుండి వచ్చిన మిస్టెర్ టురేక్ అనే అతను ఏమరుపాటున పోగొట్టుకున్న ఖరీదైన వీడియో కెమేరా రవికి, అతని స్నేహితులకి దొరుకుతుంది. వాళ్ళకి దొరికిన సంగతి అతనికి తెలీదు. కానీ, అతనుండే హోటలు దర్వాను పసిగడ్తాడు. ఉత్సవం గడిచే వారం రోజులు గడువుగా పెట్టుకుని, సినిమా తియ్యాలనే నిర్ణయానికొస్తారు పిల్లలు. వారం రోజుల కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటారు. ఏడవరోజు టురేక్ కెమేరా అతనికి అందజెయ్యాలని తీర్మానించుకుంటారు. దర్వాను కంట పడకుండా, అతడి నించి తప్పించుకోవాలనే ప్రయత్నంలో రకరకాల ప్రహసనాలు.
రవి స్నేహితుడు హమీద్ ది సంపన్న కుటుంబం. తండ్రి దుబాయ్ లో వుండి పుష్కలంగా డబ్బు పంపిస్తుంటాడు, అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడు. కారు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోగా, బాబాయి చేరదీయగా వాళ్ళ ఇంటి పంచన జేరిన పదహారేళ్ళ సలేహా హమీద్ ఇంట్లో వుంటూ, పిన్నమ్మకు భయపడ్తూ, వయసుకు సహజమైన సరదాలను దాచిపెట్టుకుని పనిమనిషి జీవితం గడుపుతుంటుంది.
సినిమాకు డబ్బు పెట్టుబడి పెట్టడం, అవసరమైన నటీనట వర్గాన్ని సమకూర్చడం, ఏర్పాట్లు చెయ్యడం హమీద్ బాధ్యత. నటవర్గంలో ఓ కీలకమైన పాత్ర పోషించడం మరో స్నేహితుడైన ఓంకా బాధ్యత. తన సినిమాకు హీరోయిన్ గా సలేహా కావాలంటాడు రవి. మా అమ్మ చస్తే ఒప్పుకోదు, కుదర్దంటాడు హమీద్. తాను హీరొయిన్ కాలేక పోయినా, వాళ్ళకు హీరోయిన్ ని ఏర్పాటు చేసే పని తనమీద వేసుకుంటుంది సలేహా.
ఇదిలా వుండగా హమీద్ తల్లి సలేహా కన్నా రెట్టింపు పెద్దవాడైన, అరబ్ దేశాల్లో వుండే ఒకతనితో ఆమె పెళ్ళి ఏర్పాటు చేస్తుంది.తనక్కాబోతున్న ఇష్టంలేని పెళ్ళి గురించిన ఆవేదన వ్యక్తావ్యక్తమైన భాషలో రవికి చెప్పుకుంటుంది సలేహా. తొడిమలోనే తుంచబడుతున్నసలేహా స్వప్నాల గురించి, ఆమె అశక్తత గురించి తీవ్రంగా బాధ పడ్తాడు రవి. ఈ విషయం హమీద్ తో అంటే వాడు పట్టించుకోడు. తల్లితో అంటే మన సమస్యలు చాలవన్నట్లు వాళ్ళ గొడవ నీకెందుకంటూ కసురుతుంది.
తన బంధువులిద్దరు సంగీతం కూరుస్తారని వాళ్ళ దగ్గరకి రవిని, ఓంకాని తీసుకెళ్తాడు హమీద్. వాళ్ళకు సంగీతమంటే ఓనమాలు తెలీవని అర్ధమైపోతుంది రవికి. రోజులు గడిచి పోతుంటాయ్. సినిమా కథ సిద్ధం కాదు. సంగీతం కుదరదు. నటులుగా కుదిరిన కుర్రాళ్ళకు అతిగా నటించడమే తప్ప, మోతాదులో నటించడం రాదు. హోటల్ దర్వాను కెమేరా చేజిక్కించుకోవాలని చేసే ప్రయత్నవలయం బిగుస్తుంటుంది. నిద్ర కరువౌతుంది. కెమేరా వాపసు ఇచ్చేయాలి. అన్నీ సమస్యలే. పరిష్కరించాల్సింది రవి ఒక్కడే.
ఏడవరోజు ముగిసే సరికి సినిమా పూర్తి చేయాలి. అదే ఏడవరోజున పరీక్ష కూడా వుంది. తల్లిని నిరుత్సాహ పరచకుండా ర్యాంకు సంపాదించాలి. పరీక్షకి చదువూ, సినిమా పూర్తి చెయ్యడం – రెండూ సాధించడం ఎలా?
ఈ విడి పోగులన్నిట్నీ అల్లుకుంటూ, నవ్వించే సన్నివేశాలతో, విభ్రమం కలిగించే ముగింపుతో ఎంతో నేర్పుగా, పెద్దలూ పిన్నలూ కూడా కలిసి చూసి, ఎవరి మటుకు వారికి, వారి వారి జీవిత శకలాలను స్పృశించిన అనుభూతి కలిగే విధంగా కథనాన్ని, దర్శకత్వాన్ని నడిపించిన ఈ “7 Days In Slow Motion” అనే చిత్రాన్ని తీసినది ఉమాకాంత్ తుమ్రుగోటి. అతనికి ఇది మొదటి ప్రయత్నమే ఐనా, చేయి తిరిగిన మనిషి ధోరణి కనిపిస్తుంది. పదమూడేళ్ళపాటు డిస్నీ స్టూడియోస్ లో కళాదర్శకుడుగానూ, ఏనిమేటర్ గానూ పని చేసినప్పుడు పోకాహాంటస్ (Pocahontas), బోల్ట్ (Bolt) వంటి సినిమాలను తెరకెక్కించడంలో, పాత్ర నిర్వహించినట్లుగానూ, ఆ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లుగానూ అతనే చెప్పుకున్నాడు.
అక్కడక్కడ తెలుగూ, హిందీ, ఉర్దూ వినబడుతూ, ఇంగ్లీషులో తీయబడిన ఈ చిత్రం ఏప్రిల్ 26న లాస్ ఏంజిలిస్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించ బడింది. ప్రేక్షకుల ఆమోదం చప్పట్ల రూపంలోనూ, ప్రశ్నోత్తర సందర్భంలో ప్రశంసా ప్రకటనల రూపంలోను వెలువడింది. నిజానికి దగ్గరగా వుండడం వల్ల,’స్లం డాగ్ మిలియనీర్ కన్నా ఎక్కువ మార్కులిస్తున్నట్లు ప్రకటించాడు ఒక ప్రేక్షకుడు. సినిమా అంతా హైదరాబాదు లో జరుగుతుంది. ఒక్క టురేక్ ను మినహాయిస్తే, నటులంతా దేశీయులే.
మనసు విరిగి, కోపంతో కోత పడ్తున్న హృదయాన్ని మోస్తూ, కొడుకు మీదే ఆశలన్నీ పెట్టుకుని జీవించే తల్లిగా రాజేశ్వరీ సచ్దేవ్ పాత్ర జ్ఞాపకం వుండిపోతుంది. జాతీయ పురస్కారాలు, మరాఠీ కళా రంగంలో పురస్కారాలు సంపాదించిన ఈ నటి చేత పాత్రను సజీవం చేయించడంలో దర్శకుడి ప్రతిభ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సలేహా వేదన మాటల్లో చెప్పే పని లేకుండా మూగ చూపులతోనే ప్రేక్షకుల మనసుకు హత్తుకుపోతుంది. రవి, ఓంకా, హమీద్ పాత్రల్లో పిల్లలు, 11, 12 సంవత్సరాల వయసు వాళ్ళ అమాయకత్వం, ఆత్మ విశ్వాసం, ప్రవృత్తికీ-వ్యావృత్తికీ మధ్య నిలిచే అడ్డంకులూ, అనుకోకుండా ఎదురయ్యే కృత్యాకృత్య మీమాంసను ఎదుర్కొనడం వంటి విషయాల్లొ సహజత్వాన్ని ప్రదర్శించి కృతకృత్యులౌతారు. చిన్నా పెద్దలందరి చేతా కూడా ఏ మాత్రం గడి దాటని నటన చేయించడంలొ దర్శకుడి నైపుణ్యం క్షణక్షణం కనబడుతుంది. మన సినిమాలను పట్టి పీడించే కృతకత్వం ఎదురవ్వదు.
కామెడీగా రూపొందించ బడిన ఈ చిత్రం చూసి ప్రేక్షకులు ఎంత అప్రయత్నంగా నవ్వుతారో, అంత అప్రయత్నంగానూ ఆ తెర మీద నడుస్తున్న జీవితాల్లొ నిబిడమైన విషాదానికి వాళ్ళు కదలడమూ జరుగుతుంది. అప్రయత్నంగా కలిగే ఈ అనుభూతుల వెనుక ఎంతో ప్రయత్నం, చిత్రనిర్మాణం మీద పరిణతి సాధించిన అవగాహన వుండక తప్పవు.
ఎన్నో బహుమతులు అందుకున్న అనూ మాలిక్, అతనితో పాటు, హైదరాబాదు వాడైన ఆశీర్వాద్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.

అవకాశం వస్తే అందరూ చూడాల్సిన విభిన్న చిత్రం 7 Days In Slow Motion.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉమాకాంత్ తుమ్రుగోటి
సంగీతం: అనూమాలిక్, ఆశీర్వాద్
వెబ్ సైట్: http://www.7daysinslowmotion.com/