కొన్ని సినిమాలు మనల్ని ఎంత వెంటాడుతాయంటే అసలు వాటిని మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది.
అలాంటి సినిమా ఇది
అసలు ఇంత చిన్న పాయింట్ మీద సినిమా తీయడం సాధ్యమా? ...మళ్ళీ అందులోను బోలెడంత సస్పెన్సు తో ...
ఇక కధలోకి వెడితే
అనగనగా ఒక బెంజి, ఒక బుల్లి కుక్క పిల్ల అన్నమాట ...
అది, దాని జుట్టు భలే ముద్దుగా ఉంటుంది.
ఈ బుజ్జి కుక్కపిల్ల అడవిలో తప్పిపోతుంది . దాన్ని వాళ్ళ మాస్టర్ వెతుకుతూ ఉంటాడు
ఇలా తప్పిపోయిన బెంజి ఒక చోట ఒక సింహాన్ని ఒక వేటగాడు కాల్చేయడం చూస్తుంది .
పాపం ఆ సింహం తల్లికి నాలుగు బుల్లి బుల్లి పిల్లలు ఉంటాయి .
తన కళ్ళ ముందు ఆ నాలుగు బుల్లి సింహం పిల్లలు అలా అనాధలు అయిపోవడం బెంజి కి బాధగా అనిపిస్తుంది .
వాటిని అలా వదిలి వెళ్ళబుద్ధి కాదు .
ఒకవైపు ఈ పిల్లల బాధ్యత , మరివైపు వాటికి మరో పెంపుడు తల్లిని వెతకాలి వీటికి తోడు వేటగాడు నుంచి తప్పించుకోవాలి... తన కోసం వెతుకుతున్న మాస్టర్ దగ్గరికి వెళ్లిపోవాలి
ఒక్కసారి ఎన్ని కష్టాలో చూసారా
వీటికి తోడు ఇంకో కష్టం ఉంది
ఈ సింహం పిల్లలు అటు ఇటు వెడుతూ అల్లరి చేస్తూ ఉంటాయి వాటిని హెచ్చరిస్తూ , జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి . ఒక సింహానికి తన పిల్లల్ని పెంచుకోవడం వస్తుంది కాని కుక్కకి ఎలా వస్తుంది ? కాని బెంజి చాలా తాపత్రయపడుతుంది.
మొత్తం మీద ఇంకో సింహం తల్లి కనిపిస్తుంది
ఆ సింహానికి ఈ నాలుగు పిల్లల్ని అప్పచెప్పాలని బెంజి ప్రయత్నం ప్రారంభిస్తుంది .
ఈ పని బెంజి ఎంత శ్రద్ధగా చేస్తుంది అంటే ..
బాధ్యత ఎలా ఉంటుంది అని మీకు సందేహం వస్తే ఈ సినిమా చూస్తే చాలు అని నాకు అనిపిస్తూ ఉంటుంది
మధ్య మధ్య లో ఒక గ్రద్ద , ఎలుగుబంటి వంటివి పిల్లల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండటం... వాటినుంచి పిల్లల్ని కాపాడుకోవడం , పెంపుడు తల్లి సింహం తన పిల్లలికి ఏవి ఎలా నేర్పిస్తోందో చూసి అవి నాలుగు పిల్లలికి నేర్పడం ...
ఇవి అన్ని ఒక ఎత్తు అయితే పిల్లల్ని ఒక్కోదానిని నోటితో పట్టుకుని ఒక పెద్ద కొండ ఇటు నుంచి అటు ఎక్కడానికి బెంజి పడే అవస్థలు చూస్తుంటే పిల్లలు పడిపోతాయేమో లేదా బెంజి కొండ ఎక్కలేక జారిపోతుందేమో అని భయం వేస్తుంది . రెప్ప వేయకుండా చూస్తాం మనం
ఈ జర్నీ లో ఒకసారి తన మాస్టర్ని చూస్తుంది . ఒక్క నిమిషం దానికి మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది విశ్వాసం దాన్ని అలా ప్రేరేపిస్తుంది . అంతలోనే తల్లిని కోల్పోయిన సింహం పిల్లలు... ఎటు వెళ్ళాలో అర్ధం కాని సదిగ్ధం లో చివరికి బెంజి తన బాధ్యత వైపు మొగ్గు చూపుతుంది. ఇక్కడ కూడా డైరెక్టర్ ఎంత బాగా తీసారో !!
మొత్తానికి పెంపుడు సింహానికి బెంజి కష్టం అర్ధం అవుతుంది
ఆ నాలుగు పిల్లల్ని అక్కున చేర్చుకుంటుంది
బెంజి తన మాస్టర్ కోసం వెళ్ళిపోతుంది
ఇంతే సినిమా
ఒకే ఒక్క డైలాగ్ సినిమా మొత్తం మాస్టర్ పిలిచే " బెంజి " అన్న పిలుపు అంతే
కాని ఎన్ని ఎమోషన్స్, ఫీలింగ్స్...
కళ్ళు మనకి తెలీకుండానే చెమ్మగిల్లుతాయి
విశ్వ భాష అంటే ఇదే కదా
విశ్వ భాష కి మాటలు అక్కర్లేదు మనసు ముఖ్యం ... విశ్వ భాష అంటే మనసు భాష అంతే ...
వీలయితే ఒక్కసారి ఈ సినిమా చూడండి ...
No comments:
Post a Comment