ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇంతకు ముందు ఇలాంటి కథతో సినిమాలు వచ్చాయి. సినిమా కబీర్ ఖాన్ అనే ఓ హాకీ ఆటగాడు/కోచ్ కథ.
సినిమా ఇండియా పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ హాకీ మాచ్ తో మొదలవుతుంది. అందులో ఆఖరి నిముషంలో వచ్చిన పెనాల్టీ ని మిస్ చేసి కబీర్ ఖాన్ దేశ ద్రోహవుతాడు. కొద్దిగా నాటకీయంగా చూపించినా ఈ నాడు మన వార్తా చానళ్ళు చాలా మటుకు ఆ కోవకి చెందినవే. చిలువలు పలువలు చేసి చూపించడం, నోటికే చెత్త వస్తే ఆ చెత్త వాగడం, చిన్న విషయాలను పెద్దవి చెయ్యడం, అనవసర డిబేట్లు పెట్టడం మొదలయినవి. ఇవన్నీ చేసి కబీర్ ఖాన్ ని ఓ దేశ ద్రోహి లా చిత్రీకరిస్తారు.
కట్ చేస్తే ఓ ఏడేళ్ళ తరవాత కబీర్ ఖాన్ మళ్ళీ తెర మీదకొస్తాడు. అదీ ఇండియా మహిళా హాకీ టీం కోచ్‌గా పనిచెయ్యడానికి. అంత వరకూ రాష్ట్రాల వారీగా ఆడే ఆ జట్టుని ఓ తాటి మీదకి తీసుకొచ్చి, డిసిప్లిన్ నేర్పించి, అదేలేండి ఆఖరికి వరల్డ్ కప్ నెగ్గేలా చేస్తాడు. అవును కొద్దిగా ఎక్సాజరేటెడ్ గానే ఉంటుంది కథ, కానీ దానిని నడిపిన తీరుని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ కి ప్రాధాన్యత ఏమిటో నాకింతకు ముందు వరకూ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తెలిసింది. సీన్లన్నీ చక్కగా కుదిరాయి. పాటలు లేవు. అవును నిజం. అదే కాక ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న క్రికెట్ పిచ్చి తప్ప ఇంకేదీ పట్టించుకోకపోవడం, అందులోనూ మహిళలు ఆడుతున్నారంటే దానిని చిన్న చూపు చూడడం, సెలెక్టర్ల అతి చేష్టలు, వంటి నిజాలెన్నో ఉన్నాయి ఈ సినిమాలో. అంతే కాదు వ్యక్తిగత రికార్డుల కోసం ఆట ఆడే ఆటగాళ్ళ గురించి కూడా సరిగ్గా చూపించాడు.
కానీ ఈ సినిమా ఓ డ్రీం అని చెప్పవచ్చు. ఎందుకంటె ఈ దేశంలో అలాంటి కోచ్ రానూ లేడు, అలాంటి మార్పులు జరగనూ లేవు, బాగు పడే అవకాశాలూ కనిపించట్లేదు.
మొత్తానికి ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు:
1. ఏ క్రికెట్ నో ఎంచుకోకుండా మన జాతీయ క్రీడ అయిన హాకీని కథాంశంగా ఎంచుకోవడం. (అవును ఇప్పుడు మన జాతీయ క్రీడ హాకీ అని కూడా జనాలు మర్చిపోయారేమో.)
2. ఆటగాళ్ళు రాష్ట్రం తరఫున కాదు దేశం తరఫున ఆడుతున్నారు అని ఎన్నో చోట్ల గుర్తు చెయ్యడం
3. ఏ క్రీడలోనయినా సీనియర్ ఆటగాళ్ళు ఇప్పుడు టీం లో ఎలా చెలాయిస్తున్నారో చూపించడం
4. దేశం తరఫున ఆడేటప్పుడు ప్రైడ్ ఉండాలి అని చెప్పడం
5. మన మీద మనం నమ్మకం పెంచుకుని, సాధనతో, కఠోర శ్రమతో విజయం సాధించగలం అని చెప్పడం
6. సొంత రికార్డుల ఆట కాదు, ఏ ఆట అయినా జట్టు లాగా ఆడాలి అనే పాయింట్ ని పదే పదే స్ట్రెస్ చెయ్యడం
సినిమాలో ఎగస్ట్రాలు లేవా ? ఉన్నాయి. కానీ మొత్తం మీద అంతర్లీనంగా ఉన్న థీం సినిమా లో అతి ని డామినేట్ చేస్తుంది. నాకయితే నచ్చింది. కుదిరితే తప్పకుండా చూడండి. “చక్ దే ఇండియా…”
-Praveen Garlapati
No comments:
Post a Comment