టాం హాంక్స్ నిర్మాత ఈ సినిమాకి. ఇందులో ఆనిమేషన్ బాగుంది. కథ కూడా చక్కగానే నడుస్తుంది.
ఓ చిన్ని పిల్లాడు తన తోటి పిల్లలు తనని ఏడిపిస్తున్నందుకు తన కోపాన్ని చీమల మీద ప్రదర్శిస్తూంటాడు. దాని వల్ల ఆ చీమలకి విపరీతమయిన నష్టం కలుగుతుంది. అందుకని ఆ చీమలు ఓ రకమయిన పోషన్ తయారు చేసి ఆ పిల్లాడిని చీమలంత చిన్నగా మార్చేస్తాయి.
తమ లోకంలోకి తీసుకెళ్ళి శిక్షగా ఆ పిల్లాడు కూడా చీమలాగే బతకాలని తీర్పిస్తాయి.
ఇక అక్కడ నుంచి చీమల ప్రపంచంలో బతుకలేక ఇమడలేక, అవి పడే కష్టం తెలుసుకుని అబ్బురపడతాడు. చివరికి ఇంత కష్టపడే చీమలనా నేను హింసిస్తుంది అని తెలుసుకుని వాటిని కాపాడతాడు.
ఈ సినిమాలో చక్కని హాస్యంతో పాటు మంచి సందేశం కూడా ఉంది. ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు. కలిసి కట్టుగా ఉంటే ఏదయినా సాధ్యమేనని చీమలు నిరూపిస్తాయి. చిన్న పెద్ద తేడా కాదు, శక్తి యుక్తి కాదు, అందరూ తమ వంతు సహాయం చేస్తే ఈ సమాజం ఎంతో బాగుపడుతుంది.
చీమల మాంత్రికుడు, పిల్లాడి కారెక్టరు, సెంటిమెంట్ పండించే మాంత్రికుడి భార్య కారెక్టర్లు నాకు నచ్చాయి. జెల్లీ బీన్స్ సన్నివేశం, కప్ప చీమలని మింగేసే ఘట్టం నాకు బాగా నచ్చాయి.
అన్నట్టు ఆనిమేషన్ ఎంత కష్టమో తెలుసా మీకు ? ఒక్కొక్క సినిమా తీయడానికే మూడునాలుగేళ్ళు కూడా పట్టవచ్చు. ఎందుకంటారా అందులో కనిపించే కారెక్టర్ల హావ భావాలు అవీ ఎంతో నాచురల్ గా రావాలంటే తప్పదు మరి. ఆ సినిమాలు చూస్తున్నంత సేపూ మనకి అవి ఆనిమేటెడ్ అయినా వాటికీ ఫీలింగ్స్ ఉంటాయి అని మనకు అనుభూతి కలిగించేలా చేయాలంటే దానికెంతో రీసెర్చ్ అవసరం మరి.
అదీ కాక ఒక్క కారెక్టర్ ని తీసుకుంటే దానికి సంబంధించిన చిన్న చిన్న వివరాలను కూడా ఎంతో జాగ్రత్తగా చెయ్యాల్సుంటుంది. ఉదాహరణకి ఆ కారెక్టర్ నడుస్తున్నప్పుడు జుట్టు ఎగరడం, నవ్వినప్పుడు పెదాలు సాగడం, ముఖ కవళికలు, నడక లో సోయగాలు మొదలయినవి.
నమ్మరా ఓ సారి ష్రెక్ లాంటి సినిమా ఒకటి చూడండి. అందుకే నేను ఎప్పుడు ఈ ఆనిమేషన్ సినిమాలు చూసినా అవి నన్ను అబ్బురపరుస్తాయి.
No comments:
Post a Comment